ముంబై:
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు లాభాల బాట పట్టింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ చివరికి 446.21 పాయింట్ల లాభంతో 85,632.68 వద్ద ముగిసింది. నిఫ్టీ చివరికి 139.50 పాయింట్ల లాభంతో 26,192.15 వద్ద క్లోజయింది.
లాభాలకు కారణాలు
ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లలో మరియు కొన్ని ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు, FPIలు తిరిగి మార్కెట్‌లోకి రావడం. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం. టెక్నికల్ విశ్లేషకులు, పెద్ద అడ్డంకులు లేకపోతే ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 91,500 పాయింట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసారు.
రిలయన్స్ షేర్ల రికార్డ్ ప్రదర్శన
గురువారం రిలయన్స్ షేర్లు రేసుగుర్రంలా పరిగెత్తాయి. ఒక దశలో బీఎస్‌ఈలో షేరు ధర రూ. 1,550.90కు చేరి మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లు సొంతం చేసుకుంది. చివరికి 2.01 శాతం లాభంతో రూ. 1,549.10 వద్ద ముగిసింది, షేర్ల మార్కెట్ విలువ రూ. 20.96 లక్షల కోట్లు వద్ద నిలిచింది.
పవర్ మెక్ ప్రాజెక్ట్స్ రుణ పరిమితి విస్తరణ
పవర్ మెక్ ప్రాజెక్ట్స్ రుణ సేకరణ పరిమితిని ప్రస్తుత రూ. 5,000 కోట్ల నుంచి రూ. 7,500 కోట్లకు పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ-ఓటింగ్ ద్వారా వాటాదారుల ఆమోదం/తిరస్కరణ పొందనున్నారు. వాటాదారులు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 వరకు తమ ఓటును వ్యక్తపరచవచ్చని కంపెనీ తెలిపింది.