శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Medaram Sammakka Sarakka Jatara : సమ్మక్క–సారలమ్మ జాతర: భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన మహోత్సవం

    1 వారం క్రితం

    మేడారం:
    సమ్మక్క–సారలమ్మ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా విశేష ఖ్యాతి గడించింది. విగ్రహాలు లేని అరుదైన జాతరగా పేరొందిన ఈ పర్వం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, వీరోచిత చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఈ జాతర నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది.

    2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అంచనా. కుంభమేళా తరువాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే పండుగగా సమ్మక్క–సారలమ్మ జాతర గుర్తింపు పొందింది. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

    దేశ నలుమూలల నుంచి భక్తుల వెల్లువ

    తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తారు. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సమయంలో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది.
    హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు బస్సు ఛార్జీ పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.45గా నిర్ణయించారు.

    వీరవనితల త్యాగానికి గుర్తుగా జాతర

    కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిపై పోరాడి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలు సమ్మక్క–సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర నిర్వహిస్తారు. కోయ గిరిజనుల ఉనికికోసం వారు చేసిన త్యాగానికి ప్రతీకగా ఈ మహోత్సవం కొనసాగుతోంది.

    స్థల పురాణాల ప్రకారం క్రీ.శ. 1260 నుంచి 1320 మధ్య ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచే ఈ జాతర కొనసాగుతోంది. అప్పట్లో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంత రాజైన పడిగిద్దరాజు పరిపాలించేవాడు. అతని సతీమణే సమ్మక్క. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం.

    యుద్ధం, త్యాగం, అదృశ్యం

    దీర్ఘకాల అనావృష్టి కారణంగా పన్నులు చెల్లించలేని పరిస్థితి రావడంతో కాకతీయ సైన్యం మేడారం ప్రాంతంపై దాడికి దిగింది. పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు కలిసి సంపెంగ వాగు వద్ద పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న వాగులో దూకి ఆత్మత్యాగం చేయడంతో ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది.

    తన కుమారుడు, కుమార్తె మరణవార్త విన్న సమ్మక్క యుద్ధరంగంలోకి వచ్చి కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. చివరకు చిలుకలగుట్ట వద్ద ఆమె అదృశ్యమైనట్లు పురాణాలు చెబుతాయి. ఆ తరువాత ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారినట్లు చరిత్ర చెబుతోంది.

    సాంప్రదాయ పూజలు, గద్దెలకు దేవతల ఆగమనం

    మేడారం జాతరలో దేవతలను గద్దెలకు తీసుకురావడం అత్యంత సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తారు. జాతరకు సుమారు పది రోజుల ముందే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
    సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణ రూపంలో తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు సంప్రదాయంగా 10 రౌండ్ల తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకువస్తారు.

    భక్తుల మొక్కుబడుల అనంతరం దేవతలు తిరిగి వనప్రవేశం చేయడం ఈ జాతరలో అత్యంత భావోద్వేగ ఘట్టంగా నిలుస్తుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ‘Daldal’ streaming, plot, cast, Bhumi as DCP
    తర్వాత ఆర్టికల్
    The extra Test: When four pitches were used for 4 innings in a match

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి