అమరావతి నవంబర్ 21:
రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా సిటీస్ (CITIIS) ప్రాజెక్ట్ ద్వారా నిర్మించబడిన అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, స్కూల్ భవనాలు పరిశీలించారు.
పర్యటన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటివరకు 15 అంగన్వాడీలు, 14 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 14 స్కూల్స్, అలాగే ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ వసతులు అందుబాటులోకి రావడంతో రాజధాని గ్రామాల్లో విద్యా, వైద్య సేవల నాణ్యత గణనీయంగా మెరుగవుతుందని పేర్కొన్నారు.
రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ మరియు కేటాయింపుల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు:
మొత్తం 69,421 మంది రైతులకు కేటాయించాల్సిన ప్లాట్లలో 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రతి రోజూ 30 నుండి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. గత 21 రోజుల్లో 231 మంది రైతులకు 443 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 30,635 మంది రైతుల్లో 29,644 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్ల కేటాయింపు మిగిలి ఉందని చెప్పారు. అమరావతి అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయని, త్వరలోనే రాజధాని రూపుదిద్దుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు.