గుడివాడ, నవంబర్ 20:
గుడివాడ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల పనులు ఆలస్యం అయినప్పటికీ, కీలకమైన రైల్వే శాఖ అనుమతులు ప్రస్తుతం మంజూరైనట్లు రాము వెల్లడించారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల పురోగతిని ఎన్.హెచ్.ఎ అధికారులతో గురువారం సాయంత్రం ప్రజా వేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాము సమీక్షించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాము—
- రైల్వే శాఖ సాంకేతిక అనుమతులు ఆలస్యం కావడంతోనే ROB పనుల్లో అవాంతరాలు ఏర్పడ్డాయని,
- భీమవరం, మచిలీపట్నం రైల్వే గేట్లపై ROB నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించిందని,
- కల్వర్టులు, OHC పోల్స్, SND కేబుల్స్ వంటి పనుల కోసం రైల్వే శాఖకు ఎన్.హెచ్.ఏ ద్వారా రూ. 8 కోట్లు చెల్లించామని తెలిపారు.
గుడివాడ MP వల్లభనేని బాలసౌరి ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఫాలో-అప్ చేస్తూ, ఢిల్లీ స్థాయి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు.
ఈ సమావేశంలో ఎన్.హెచ్.ఏ D.E సత్యనారాయణ, A.E శరత్ చంద్ర, మున్సిపల్ M.E ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.