బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు తీవ్ర అస్థిరంగా ఉన్న నేపథ్యంలో, ఆ దేశ మాజీ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ ఆజ్మీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆజ్మీ మాట్లాడుతూ “భారత్ ముక్కలుగా విరగకపోతే, బంగ్లాదేశ్‌లో పూర్తిస్థాయి శాంతి నెలకొదని” చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఈ వ్యాఖ్యలు భారత్‌లోని సామాజిక మాధ్యమ వేదికలపై తీవ్ర విమర్శలకు గురయ్యాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారతదేశం పోషించిన కీలక పాత్రను మరిచి ఇలాంటి ప్రకటనలు చేయడం సిగ్గుచేటు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిస్ధితిని మరింత ఉద్రిక్తం చేస్తున్న నేపథ్యం
గతేడాది జూన్–ఆగస్టు నెలల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన భారీ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో, అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఢాకా–న్యూఢిల్లీ సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి.
ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్‌లోని వేర్పాటువాద భావజాలం కలిగిన వర్గాలు భారత్ వ్యతిరేక వ్యాఖ్యలను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆజ్మీ కుటుంబ నేపథ్యం కూడా అదే దిశగా సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వివాదాస్పద కుటుంబం – వివాదాస్పద వ్యాఖ్యలు
ఆజ్మీ తండ్రి గులామ్ అజమ్ 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో యుద్ధ నేరాలకు దోషిగా తేలిన జమాతే ఇస్లామీ పార్టీ మాజీ అధినేత. ఈ నేపథ్యంతో ఆజ్మీ తరచూ భారతదేశంపై దుష్ప్రచారం చేస్తుంటారని బంగ్లాదేశ్ రాజకీయ వర్గాలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాలకు దెబ్బ?
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం భారతదేశంతో సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్న వేళ, మాజీ జనరల్ ఆజ్మీ చేసిన వ్యాఖ్యలు అవాంఛిత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
భారత్ స్పందన?
ప్రస్తుతం భారత అధికార వర్గాలు ఈ వ్యాఖ్యలపై అధికారికంగా ప్రతిస్పందించకపోయినా, భద్రతా, దౌత్య వర్గాలు పరిస్థితిపై నిశితంగా నిఘా ఉంచుతున్నట్లు తెలిసింది. భారత సమాజంలో మాత్రం ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అంతర్జాతీయ నిపుణుల హెచ్చరిక
బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఉపయోగించుకొని పాకిస్థాన్, చైనా వంటి దేశాలు భారత్ వ్యతిరేక కథనాలను ప్రోత్సహించే అవకాశం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు రెండుదేశాల సహకార సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.