ఢిల్లీ, నవంబర్ 2: దేశంలో విక్రయించే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ను డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలు ఇవాళ పార్లమెంట్‌లో పెద్ద వివాదాన్ని రేపాయి. ప్రైవసీ ఉల్లంఘనకు ఇది నిదర్శనం అంటూ విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
లోక్‌సభలో ఈ అంశంపై చర్చ మొదలయ్యాక సభా కార్యక్రమాలే నిలిచిపోయే స్థాయిలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్, శివసేన UBT, తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈ నిర్ణయాన్ని “ప్రజల వ్యక్తిగత గోప్యతపై దాడి”గా అభివర్ణిస్తూ కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించాయి.
"సంచార్ సాథీ ప్రజలపై నిఘా సాధనం" – విపక్షాల ఆరోపణలు
సంచార్ సాథీ యాప్ ద్వారా ఫోన్ యూజర్ల కదలికలు, కాల్స్, మెసేజెస్ మానిటర్ చేయబడతాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, “ఇది డిస్టోపియన్ టూల్… ప్రతి భారతీయుడిని మానిటర్ చేసే ప్రయత్నం. ఇది ప్రజల ఆర్థిక, వ్యక్తిగత హక్కులపై దాడి” అని విమర్శించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి దీని పై వాయిదా తీర్మానం దాఖలు చేసి విస్తృత చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
శివసేన UBT ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, “ఇది భవిష్యత్‌లో నియంతృత్వ పాలనకు మార్గం వేస్తుంది… ప్రజల గోప్యతను హరిస్తోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. TMC ఎంపీ సాగరిక ఘోష్ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టుతూ, “ఇది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది” అని పేర్కొన్నారు.
ప్రభుత్వం సమాధానం: “ప్రైవసీ ఉల్లంఘన లేదు… సైబర్ సెక్యూరిటీ కోసం మాత్రమే”
విపక్షాల ఆందోళన మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేస్తూ, “సంచార్ సాథీపై చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కానీ సెషన్ ఎజెండాలో ఉన్న 14 బిల్లుల మీద ముందుగా చర్చ జరగాలి” అని తెలిపారు.
అదే సమయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) కీలక వివరణ ఇచ్చింది.
సంచార్ సాథీ యాప్ కేవలం సైబర్ సెక్యూరిటీ మరియు ఫ్రాడ్ నివారణ కోసమే ఉద్దేశించబడింది. ఇందులో ఏ విధమైన ప్రైవసీ ఉల్లంఘన ఉండదని స్పష్టం చేసింది. యూజర్ డేటా రక్షణకు పూర్తి భరోసా ఇస్తున్నట్లు తెలిపింది.
కేంద్రం నిర్ణయంపై విపక్షాలు మండి పడుతున్న తరుణంలో, సంచార్ సాథీ యాప్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఈ ఇష్యూ వచ్చే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.