హైదరాబాద్, డిసెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో వివాదం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు తెలియక పవన్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
కోనసీమ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. “డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే మాటల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు,” అని ఆయన పేర్కొన్నారు.
పవన్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడవు – కోమటిరెడ్డి హెచ్చరిక
పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
“పవన్ క్షమాపణ చెప్పితే ఆయన సినిమా ఒకటి రెండు రోజులు తెలంగాణలో ఆడుతుంది. లేనిపక్షంలో ఇక్కడ సినిమాలు ఆడవు,” అని మంత్రి గట్టి హెచ్చరిక జారీ చేశారు. పవన్‌తో పోలిస్తే చిరంజీవి గొప్ప వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
‘మాట్లాడే ముందు తెలుసుకోవాలి’ – పవన్‌కు మంత్రి హితవు
పవన్ కల్యాణ్ అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని, తెలియకుండా మాట్లాడితే ప్రజల్లో అయోమయం, బాధ కలగొచ్చని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ సమయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. “ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి వినియోగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ పాలనలో మేము నష్టపోయాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం,” అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.