కర్నాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు తగ్గడం పేరు పెట్టి కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఏర్పడిన వర్గీకరణ కారణంగా కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ నేతలను మళ్లీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇటీవల డీకే శివకుమార్ సీఎం నివాసానికి విలేఖరినీడలో అల్పాహారం కోసం వెళ్లి కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం ఇద్దరూ కలిసి పార్టీ శ్రేణులకు ఐక్యతా సందేశం పంపించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే తమకు అంతిమమని ఇద్దరు స్పష్టం చేశారు. తాజాగా డిసెంబర్ 2న సీఎం సిద్ధరామయ్య, డీకే ఇంటికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ఆహ్వానం ఇంకా అందలేదని సీఎం వెల్లడించారు. ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని ఆయన చెప్పారు.
సీఎం వ్యాఖ్యలపై స్పందించిన డీకే శివకుమార్, ఇది తమిద్దరి మధ్య విషయం మాత్రమేనని చెప్పారు. “మేము అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తాం” అని వ్యాఖ్యానించిన ఆయన, సీఎంకు తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానం పంపించారు. ఈ పరిణామాలు ఇద్దరు నేతల మధ్య ఉన్న భేదాలు తగ్గుతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటకలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిద్ధరామయ్య–డీకే శివకుమార్ ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు సీఎంగా పని చేసే ఒప్పందం జరిగిందన్న ప్రచారం అప్పటినుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాయకత్వ మార్పు తథ్యమని కొంతమంది భావిస్తున్నారు.
అయితే హైకమాండ్ తాజా సూచనల ప్రకారం, అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తక్షణ మార్పు ఉండే అవకాశాలు తగ్గాయి. నాయకత్వ వివాదంపై ఇద్దరు నేతల సమావేశాలు, సయోధ్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడంతో కాంగ్రెస్‌లోనూ పరిస్థితి క్రమంగా సానుకూలంగా మారుతోందని భావించబడుతోంది.