భాషతో సంబంధం లేకుండా పాన్-ఇండియా స్థాయిలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్, ఇటీవల బాలీవుడ్ పని సంస్కృతిపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హిందీ చిత్ర పరిశ్రమలో తనపై చూపిన వ్యవహారం మరియు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీతో ఉన్న పోలికలను ఆయన ఓ తాజా ఇంటర్వ్యూలో వెల్లడి చేశారు.
దుల్కర్ మాట్లాడుతూ, “బాలీవుడ్‌లో నటించేటప్పుడు, నేను స్టార్‌ని అని అందరినీ నమ్మించుకోవాల్సి వచ్చేది. నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉండాలి, లగ్జరీ కారులో చేరాలి—అప్పుడే మనల్ని ‘స్టార్’గా పరిగణిస్తారు. ఇవి లేకపోతే సెట్‌లో కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వరు. మానిటర్ చూడటానికి కూడా స్థలం కేటాయించరు,” అని అన్నారు. 2018లో కార్వాన్ సినిమాతో ఆయన హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు, మలయాళ సినిమా పరిశ్రమ పూర్తిగా భిన్నమని దుల్కర్ పేర్కొన్నారు. “మా ఇండస్ట్రీలో అధిక బడ్జెట్లు ఉండవు. లగ్జరీ అనే ఆలోచనే ఉండదు. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. చాలా వస్తువులు ఇంటి నుంచే తెచ్చుకుంటాం. పనితీరులో ఎంతో సరళత, సహజత్వం కనిపిస్తుంది,” అని అన్నారు.
దుల్కర్ ఇటీవల నటించిన కాంత చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దుల్కర్ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్క్ కల్చర్‌పై మళ్లీ చర్చను మొదలుపెట్టాయి.