తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటిస్తూ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చించారు. పార్లమెంట్ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని మోదీని అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ – 2047 గ్లోబల్ సమ్మిట్” కు రావాల్సిందిగా సీఎం ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సమ్మిట్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను ప్రధానికి సమర్పించారు.
తమ ప్రభుత్వ దూరదర్శి ప్రణాళికలను వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి, వికసిత్ భారత్ – 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధానికి తెలియజేశారు. అన్ని రంగాల వృద్ధి వ్యూహాలు, భవిష్యత్ దిశానిర్దేశంతో కూడిన “తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్” ను సిద్ధం చేశామని తెలిపారు. నీతి అయోగ్ సూచనలు, వివిధ రంగాల నిపుణుల సిఫారసులతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి వివరించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ సమ్మిట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.