తిరువనంతపురం:
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. కేసులో కీలకమైన మలుపు తిరుగుతూ ఇవాళ మాజీ ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు అధ్యక్షుడు, సీపీఐ(ఎం) నేత పద్మకుమార్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. ఉదయం విచారణకు హాజరైన ఆయనను, ప్రశ్నల అనంతరం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సిట్ ప్రకారం, పద్మకుమార్ ఈ కేసులో ఎనిమిదో నిందితుడు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌తో ఆయనకు సాన్నిహిత్య సంబంధాలు, అలాగే ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీల ఆధారంగానే పద్మకుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, శబరిమల ఆలయ రికార్డులను పద్మకుమార్‌కు తెలిసే తారుమారుచేశారనే అనుమానాలు బలపడాయి. ముఖ్యంగా, బంగారు తాపడాల స్థానంలో రాగి రేకులను నమోదు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఉన్నికృష్ణన్ నెట్‌వర్క్‌పై గట్టి దర్యాప్తు
అయ్యప్ప ఆలయం బంగారు తాపడం కోసం వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌పై ఇప్పటికే సిట్ విస్తృతంగా దర్యాప్తు జరుపుతోంది. ఇటీవల పొట్టిగా పిలవబడే ఉన్నికృష్ణన్ ఇంటి నుంచి అధికారులు ₹2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే బళ్లారికి చెందిన ‘రొద్దమ్ జ్యువెలరీ’ యజమాని గోవర్ధన్ వద్ద నుంచి సిట్ 400 గ్రాముల బంగారం, పలు బంగారు నాణేలు స్వాధీనం చేసింది. దర్యాప్తులో 2019 నుంచే పొట్టి–గోవర్ధన్ మధ్య 476 గ్రాముల బంగారం లావాదేవీ జరిగినట్లు ఖాతాలు నిర్ధారించాయి. ఈ లావాదేవీలకు చెన్నైలోని ‘స్మార్ట్ క్రియేషన్’ మధ్యవర్తిగా పని చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో కల్పేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు.