వాషింగ్టన్, నవంబర్ 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు న్యూయార్క్ నూతన మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తమ తొలి సమావేశాన్ని శ్వేతసౌధంలో శుక్రవారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న ఇద్దరు నాయకులు—ఈ భేటీలో పూర్తిగా భిన్నమైన స్వరంతో కనిపించారు. అమెరికా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సమావేశం గురించి ట్రంప్ మాట్లాడుతూ, “మా సమావేశం గొప్పగా జరిగింది. అనేక కీలక అంశాలపై మేము ఏకాభిప్రాయానికి వచ్చాం” అని అన్నారు. మమ్దానీతో కలిసి రూపొందించబోతున్న సంయుక్త కార్యాచరణ ప్రణాళికకు తాను మద్దతు ఇస్తానని కూడా ఆయన ప్రకటించారు.
పాత ఘర్షణలపై ట్రంప్ నెమ్మదించిన ధోరణి
ఎన్నికల సమయంలో మమ్దానీని “కమ్యూనిస్ట్” అని విమర్శించిన ట్రంప్—ఈ రోజు మాత్రం పూర్తి భిన్నంగా స్పందించారు. ఒక రిపోర్టర్ ప్రశ్నించాలని ప్రయత్నించగా, “దట్స్ ఓకే” అంటూ ట్రంప్ స్వయంగా మాట దాటేసి గత విమర్శలకు అతుక్కుపోనని సందేశం ఇచ్చారు. మమ్దానీ గురించి మాట్లాడుతూ, “అతను అద్భుతమైన మేయర్ అవుతాడని నేను ఆశిస్తున్నాను. కాలక్రమేణా అతని అభిప్రాయాలు మారవచ్చు—నేనూ ప్రభుత్వంలో ఉండగా కొన్ని అభిప్రాయాలు మార్చుకున్నానే” అని ట్రంప్ అన్నారు.
ఆర్థిక సమస్యలపై విస్తృత చర్చ
సమావేశం అనంతరం మమ్దానీ మీడియాతో మాట్లాడుతూ, “మా సంభాషణ చాలా ఉత్పాదకంగా సాగింది” అని తెలిపారు. న్యూయార్క్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు, అద్దె, యుటిలిటీ బిల్లులు, కిరాణా ధరలు వంటి అంశాలపై తమ మధ్య లోతైన చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు.
“న్యూయార్క్‌లో ప్రజలు ఎలా బతికేందుకు కష్టపడుతున్నారు, జీవన వ్యయం ఎలా పెరిగిపోతోంది—ఇవన్నీ మా చర్చలో ప్రధానాంశాలు” అని మమ్దానీ అన్నారు. సమావేశం పూర్తిగా స్నేహపూర్వకంగా జరిగిందని, మమ్దానీ ఎన్నికల విజయంపై ట్రంప్ స్వయంగా అభినందనలు తెలిపారని తెలుస్తోంది. “ఈ పోటీలో మీరు అనేక తెలివైన ప్రత్యర్థులను ఓడించారు” అని ట్రంప్ ఆయనను ప్రశంసించినట్లు సమాచారం.