బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పాట్నాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బిహార్ ముఖ్యమంత్రి గా పదవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నితీష్ కుమార్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ఉదయం నుంచే ఉత్సాహభరితంగా కనిపించారు. పాట్నా గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు భారీగా జనసందోహం తరలివచ్చింది. ఈ సందర్భంగా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రధాని మోదీ తన మెడలో వేసుకున్న కండువాను గాల్లో ఊపుతూ, తలపై చక్రంలా తిప్పుతూ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ‘గంచా మూమెంట్’ భారీగా వైరల్ అవుతోంది.
కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఎన్డీయే అగ్రనేతలు హాజరయ్యారు. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా, అలాగే మరో 26 మంది మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్డీయే విజయోత్సాహం నడుమ జరిగిన ఈ వేడుకలో ప్రధాని మోదీ స్టేజ్‌పై, స్టేజ్‌కు వచ్చే సమయంలో కూడా ప్రజలకు అభివాదం చేస్తూ, కండువా ఊపుతూ, వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.