హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. చారిత్రాత్మక చార్మినార్ వద్ద శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సైబర్ క్రైమ్ మోసాల గురించి ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ—
ప్రతి శనివారం, మంగళవారం చార్మినార్ వద్ద గడపగడపకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సైబర్ మోసాలకు గురవుతున్నారని, ప్రతి రోజు హైదరాబాద్‌లోనే సుమారు కోటిరూపాయలు కోల్పోతున్నారని వివరించారు. ముఖ్యంగా ఓటీపీ ఇన్వెస్ట్‌మెంట్లు, డిజిటల్ అరెస్ట్, ఫోన్ బెదిరింపులు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే ప్రజలకు కీలక సూచనలు చేశారు:
సైబర్ నేరగాళ్లు కాల్ చేసి భయపెట్టినా భయపడకూడదని, భయం నేరస్తులకు బలం అవుతుందని హెచ్చరించారు. ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయరాదని, అలా చేస్తే ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘సైబర్ సింబా’ పేరిట వాలంటరీ వ్యవస్థను ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పౌరుల్లో సైబర్ అవగాహన పెంచి, నగరాన్ని సైబర్ మోసాల నుండి రక్షించడమే లక్ష్యమని సీపీ పేర్కొన్నారు.