చండీగఢ్ పరిపాలనా స్వరూపాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. పార్లమెంట్ బులిటెన్ ప్రకారం డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025’ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఆర్టికల్ 240 కింద చండీగఢ్?
ప్రతిపాదిత సవరణ ద్వారా చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురానుంది. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి అండమాన్–నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల కోసం నేరుగా నిబంధనలు రూపొందించే అధికారం ఉంటుంది. ప్రస్తుతం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ ఉమ్మడి రాజధాని కాగా, పంజాబ్ గవర్నర్ అక్కడ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 240 పరిధిలోకి చండీగఢ్ చేరితే, రాష్ట్రపతి నియంత్రణ పెరిగి, పంజాబ్ గవర్నర్ పాత్ర తగ్గే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పంజాబ్‌లో భారీ వ్యతిరేకత
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఘాటు విమర్శలు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “చండీగఢ్ పంజాబ్‌ది… దానిని లాక్కోవడానికి కేంద్రం కుట్ర చేస్తోంది,” అన్నారు. చండీగఢ్ నిర్మాణం కోసం పంజాబ్ గ్రామాలను ధ్వంసం చేశారని, ఆ నగరంపై హక్కు పూర్తిగా పంజాబ్‌కే చెందుతుందని తెలిపారు. అవసరమైతే అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేజ్రీవాల్ కూడా రంగంలోకి
ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రాన్ని తప్పుబట్టారు. ఇది పంజాబ్ అస్తిత్వంపై దాడి అని విమర్శించారు. “చండీగఢ్ పంజాబ్‌దే… అలాగే ఉంటుంది,” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల ఏకగ్రీవ వ్యతిరేకత
కాంగ్రెస్, అకాలీదళ్ వంటి పంజాబ్ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నిర్ణయంపై ఏకమై కేంద్రాన్ని విమర్శించాయి. కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ హెచ్చరిస్తూ—
“చండీగఢ్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఘోర పరిణామాలు ఉంటాయి,” అని కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ విషయంలో తమ వైఖరిని స్పష్టంచేయాలని పంజాబ్ బీజేపీ నేతలకు డిమాండ్ చేశారు.
పరిణామాలు ఏంటి?
కేంద్ర ప్రతిపాదించిన ఈ సవరణ అమలు అయితే, చండీగఢ్ పరిపాలన పూర్తిగా కేంద్ర ఆధీనంలోకి మారుతుంది. పంజాబ్ రాజకీయాల్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా, రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇది ప్రధానంగా నిలవడం ఖాయం.