బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తాజాగా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’లోని పవిత్ర దైవ ఆవహించిన సన్నివేశాన్ని స్టేజ్‌పై కామెడీగా అనుకరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటన తర్వాత కన్నడిగులు రణ్‌వీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమంలో ఈ వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. రణ్‌వీర్ సింగ్ కార్యక్రమానికి హాజరై ‘కాంతార’లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. ముఖ్యంగా దైవం ఆవహించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని పొగిడారు. అయితే అనంతరం స్టేజ్‌పై ‘కాంతార’లో ఫేమస్ అయిన 'ఓ' అంటూ వినిపించే దైవ నాదాన్ని సరదాగా అనుకరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన చేసిన ఆ హావభావాలు రిషబ్ శెట్టికి కూడా అసౌకర్యం కలిగించినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రణ్‌వీర్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ సంస్కృతిలో అత్యంత పవిత్రంగా భావించే దైవ ఆహ్వానాన్ని అగౌరవపరచడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన నటించిన ‘ధురంధర్’ సినిమా విడుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే తాజా వివాదం నేపధ్యంలో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఈ ఘటనపై రిషబ్ శెట్టి అధికారికంగా ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.