శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ORR Land Acquisition Notification : ఓఆర్‌ఆర్ భూ సేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసన

    1 వారం క్రితం

    • “మా భూమి మా హక్కు” అంటూ మధిర రోడ్డుపై ఆందోళన

    వీరులపాడు (ఎన్టీఆర్ జిల్లా), జనవరి 29 (తొలి ఉదయం):
    ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) నిర్మాణం కోసం ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా గురువారం వీరులపాడు మండలం పోన్నవరం క్రాస్‌రోడ్డు వద్ద మధిర రోడ్డుపై రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళనలో రైతులతో పాటు అఖిల భారత రైతు సంఘం (కిసాన్ సభ) ప్రధాన కార్యదర్శి విజు కిష్టన్ పాల్గొని నినాదాలు చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బలవంతపు భూ సేకరణ చేపడుతోందని, “మా భూమి మా హక్కు” అంటూ రైతులు గళమెత్తారు. ఓఆర్‌ఆర్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ జాబితాలో ఉన్న భూములను బాధిత రైతులతో కలిసి పరిశీలించారు.

    ఈ సందర్భంగా విజు కిష్టన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అత్యంత సారవంతమైన భూములున్నాయని, సంవత్సరానికి మూడు పంటలు పండే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పొగాకు, మిర్చి, వేరుశనగ, కూరగాయలు, పత్తి, మొక్కజన్న, పసుపు వంటి వాణిజ్య పంటలు విస్తృతంగా సాగవుతున్నాయని చెప్పారు. ఈ భూములపై ఆధారపడి వ్యవసాయ కూలీలు, పేదలు జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.

    హైదరాబాద్–విజయవాడ, కంచికచర్ల–మధిర రోడ్డుకు సమీపంగా ఉన్న ఈ ప్రాంత భూములకు ఎకరం రూ.6 కోట్ల వరకు ధరలున్నాయని తెలిపారు. ఇప్పటికే వివిధ గ్రామాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు నివాసాల కోసం భూములు కొనుగోలు చేశారని చెప్పారు. ఇలాంటి భూములు కోల్పోతే పేద ప్రజలు, వివిధ వృత్తులపై ఆధారపడినవారు తమ జీవనాధారం కోల్పోతారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగం కూడా దెబ్బతింటుందని అన్నారు.

    “ఇలాంటి బలవంతపు భూ సేకరణ జరిగితే ఆత్మహత్య తప్ప మరో మార్గం ఉండదు”, “మాకు న్యాయం చేయాలి” అంటూ రైతులు తమ సమస్యలను కిసాన్ సభ నేతల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వద్ద నుంచి సమస్యలను సేకరించి, భూముల మార్కెట్ విలువలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.

    తదుపరి విజు కిష్టన్ మాట్లాడుతూ, ఐదు జిల్లాల పరిధిలో 190 కిలోమీటర్ల పొడవు, 140 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి 250 మీటర్ల భూమి ఎందుకు సేకరిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు మండలాల పరిధిలో రైతుల భూములను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా మోసపూరితంగా సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టు కోసం భూములు సేకరించేటప్పుడు ముందుగా రైతులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఓఆర్‌ఆర్ కోసం కేవలం 21 రోజుల మాత్రమే గడువు ఇవ్వడం అన్యాయమని అన్నారు. కనీసం 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉండగా రైతుల అభిప్రాయాలను పట్టించుకోలేదని విమర్శించారు.

    భూములపై భవనాలు ఉన్నాయా, ఏ పంటలు సాగవుతున్నాయి, బోర్లు ఉన్నాయా వంటి అంశాలను ముందుగా పరిశీలించకుండా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. భూములు కోల్పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ రేటుకు అనుగుణంగా నష్టపరిహారం, రీ-సెటిల్‌మెంట్, ఉపాధి కల్పన చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నష్టం చేస్తోందని ఆరోపించారు. రైతు సంఘం నాయకుడు అప్పలరాజును అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఎన్టీఆర్ జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్తో పాటు వివిధ గ్రామాల రైతులు, రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూర్తి సంఘీభావం తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Budget 2026 for agriculture: The opportunity to strengthen India’s crop protection backbone
    తర్వాత ఆర్టికల్
    WPL: RCB begin chase against UP Warriorz

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి