శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Dhritarastra: మహాభారతంలో నిజంగా అత్యంత అదృష్టవంతుడు ధృతరాష్ట్రుడు

    1 వారం క్రితం

    మహాభారతాన్ని మొత్తం ఒకసారి ధర్మ–అధర్మాల కోణంలో కాకుండా, కేవలం ఫలితాల కోణంలో పరిశీలిస్తే, అత్యంత అదృష్టవంతుడు ఎవరో స్పష్టంగా కనిపిస్తాడు. ఎంతటి పాపాలు చేసినా, ఎంతటి నీచత్వం ప్రదర్శించినా, చివరి వరకు రాజభోగాలు అనుభవించిన వ్యక్తి ధృతరాష్ట్రుడే. పుట్టుకతో అంధుడైనా, రాజ్యాధికారానికి అర్హుడు కాకపోయినా, తమ్ముడైన పాండురాజు వల్ల రాజసుఖాలు దక్కాయి. పాండురాజు ప్రపంచాన్ని జయించి తెచ్చిన అపార సంపదలను అనుభవించినవాడూ ఆయనే. గాంధారి ద్వారా నూట ఒక్కమంది కుమారులను పొందాడు. దాసి ద్వారా కూడా సంతానం కలిగింది. అనేక భార్యలు, విస్తారమైన వంశం—“గుఱ్ఱం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు” అన్న సామెతకు సజీవ ఉదాహరణ ధృతరాష్ట్రుడే.

     

    పాండురాజు మరణానంతరం కూడా పాండవులు సంపాదించిన రాజ్యాలు, సంపదలు అన్నీ ధృతరాష్ట్రుడి ఆధీనంలోనే ఉన్నాయి. ధర్మరాజు అతని మాటను శాసనంగా స్వీకరించేవాడు. దుర్యోధనుడు పాండవులపై ఎన్ని కుట్రలు చేసినా, ఎంతటి కుయుక్తులు పన్నినా, ధృతరాష్ట్రుడు ఒక్కసారైనా నిజంగా మందలించలేదు. రాజ్యకాంక్షతో అంధుడైన తండ్రి, కొడుక్కి అన్నీ ఇవ్వాలనే కోరికతో ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. రాజ్యం పంచాల్సిన వేళ దుర్యోధనుడికి సారవంతమైన భూమిని ఇచ్చి, ధర్మరాజుకు అడవులు, బీడు భూమిని భాగంగా ఇచ్చాడు. పెద్దన్న ఇచ్చాడనే కారణంతో ధర్మరాజు కిమ్మనకుండా అంగీకరించాడు. అయితే ఆ బీడు భూమినే శ్రీకృష్ణుడి సహాయంతో, మయుడి ద్వారా ఎనిమిది నెలల్లో అద్భుతమైన ఇంద్రప్రస్థంగా మార్చాడు.

     

    యుధిష్ఠిరుడు తన తమ్ముళ్ల శౌర్యంతో ప్రపంచాన్ని జయించి, అపారమైన సంపదలు సంపాదించి రాజసూయ యాగం చేశాడు. ఆ సంపదలు చూసి దుర్యోధనుడిలో అసూయ చెలరేగింది. అదే అసూయ మాయాజూదానికి దారి తీసింది. జూదంలో రాజ్యం మొత్తం లాగేసి, ద్రౌపదిని ఏకవస్త్రగా సభకు లాగి, వస్త్రాపహరణానికి కూడా వెనుకాడలేదు. ఇంత జరుగుతున్నా ధృతరాష్ట్రుడు నోరు మెదపలేదు. భీమసేనుడి ఘోర శపథం విన్న తరువాతే భయపడి రాజ్యం ఇచ్చినట్టు ఇచ్చి, మళ్లీ జూదం ఆడించి అన్నింటినీ లాగేశాడు. పాండవులు సర్వస్వం కోల్పోయి అడవుల పాలయ్యారు.

     

    అడవుల్లో ఉన్న పాండవులను కూడా శాంతిగా ఉండనీయలేదు. శకుని, కర్ణుడు వంటి వారు దుర్యోధనుడికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. గంధర్వుల చేతిలో దుర్యోధనుడు అవమానపాలై బంధించబడితే, ధర్మరాజే భీముడిని అర్జునుడిని పంపించి విడిపించాడు. అయినా దుర్యోధనుడికి అవమానం తట్టుకోలేక ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. అప్పుడు పాతాళ లోక శక్తులు వచ్చి అతన్ని ఆపి, భూలోకాన్ని అల్లకల్లోలం చేయడానికి నిన్నే ఎంచుకున్నామని చెప్పి తిరిగి రాజ్యానికి పంపించాయి.

     

    రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడిని బంధించడానికి కూడా సిద్ధమయ్యాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించినప్పుడు, కోరిన వెంటనే దివ్యదృష్టి పొంది ఆ విశ్వరూపాన్ని దర్శించిన అదృష్టవంతుడు కూడా ఆయనే. సంజయుడి ద్వారా భగవద్గీత విన్నప్పటికీ, యుద్ధాన్ని ఆపలేదు. చివరికి అతని నోట వచ్చిన ప్రశ్న “నా కొడుకులు గెలిచారా?” అన్నదే. యుద్ధంలో నూట ఒక్కమంది కుమారులు నశించినప్పటికీ, పాండవుల వల్ల రాజ్యభోగాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

     

    వృద్ధాప్యంలో గాంధారి, కుంతితో కలిసి తపోవనానికి వెళ్లి తపస్సు చేశాడు. వ్యాసమహర్షి అనుగ్రహంతో, మానవ శరీరాలు ధరించిన తన చనిపోయిన కుమారులను ఒకరోజంతా చూసే భాగ్యాన్ని కూడా పొందాడు. ధర్మం లేదు, న్యాయం లేదు, పశ్చాత్తాపం లేదు—అయినా జీవితాంతం రాజభోగాలు, వరాలు, దర్శనాలు అనుభవించిన ఘనత ధృతరాష్ట్రుడికే దక్కింది. అందుకే, మహాభారతాన్ని మొత్తం చూస్తే, అత్యంత అదృష్టవంతుడు ధృతరాష్ట్రుడేనని చెప్పక తప్పదు. కాకపోతే, ఈ రోజుల్లో కూడా ధృతరాష్ట్రులు, దుర్యోధనులు తక్కువేమీ లేరు. తాము సంపాదించని సొమ్ముకోసం ఆరాటపడేవారు, ఇతరుల శ్రమపై జీవించాలనుకునేవారు ఇప్పటికీ కోకొల్లలు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    How to make urad dal pinni at home: The winter sweet Punjabis swear by
    తర్వాత ఆర్టికల్
    Budget 2026 Expectations: India's Crypto Sector Want Clarity, Not Confusion

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి