ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన వైఎస్ షర్మిల.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా విపత్కర కాలంలో సామాన్య ప్రజల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్లు చెవులు మూసుకుని పరిపాలన చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పాలన పిల్లి కళ్లుమూసుకని పాలు తాగుతున్న చందంగా ఉందని ఆరోపించారు. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల కోసం జనం క్యూలు కట్టి రూ.3500 ఇంజెక్షన్‌ రూ.40వేలు పెట్టి కొంటున్నామన్న తెలంగాణ ప్రజల గగ్గోలు కేటీఆర్‌కి కనిపించట్లేదు వినిపించట్లేదని విమర్శించారు. తండ్రీ కొడుకులు గారడి మాటలు పక్కన పెట్టి బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ల కొరత ఉందని ఒప్పుకుని, వాటిని ఎలా అందించాలో ఆలోచించాలని షర్మిల సూచించారు. షర్మిల విమర్శలపై అటు ప్రభుత్వం నుండి ఎటువంటి కౌంటర్ రాలేదు.