ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారమా.. సైదాబాద్‌ ఘటన ఫై మహేష్ ఎమోషనల్ ట్వీట్

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఇటీవల 6 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై యావత్ ప్రజానీకం భగ్గుమంటోంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన ఫై చిత్రసీమ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మంగళవారం సినీ హీరో మంచు మనోజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితుడ్ని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరగా.. తాజాగా మహేష్ బాబు సైతం ట్విట్టర్ ఈ ఘటన ఫై భావోద్వేగానికి గురయ్యారు.

‘హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన దారుణమైన ఘటన.. సమాజంలో పడిపోతున్న విలువలకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ సమాజంలో మన కూతుళ్లు సురక్షితంగానే ఉంటారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కుటుంబం ఈ బాధను ఎలా తట్టుకుంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అధికారులు వెంటనే తగిన చర్యలను తీసుకొని చిన్నారి కుటుంబానికి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.