ఏపీఎస్డీసీ ద్వారా తీసుకొచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు ఏమయ్యాయి?

రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ)ను రాష్ట్ర అప్పుల కార్పొరేషన్ గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  విమర్శించారు. ఏపీఎస్డీసీ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని, నాణ్యమైన విద్య, మహిళా సాధికారిత సాధిస్తామని గొప్పలు చెప్పి అప్పులు తీసుకొచ్చిన నాయకులు. దొడ్డిదారిన జేబులు నింపుకొన్నారని తెలిపారు.ఈ కార్పోరేషన్ ద్వారా తెచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు ఏమైపోయాయో లెక్కలు తేలలేదు అని స్పష్టం చేశారు. అవి ఎటుపోయాయి.. ఎవరి అభివృద్ధి కోసం మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ. 23 వేల కోట్ల రుణాల్లో అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలకు రూ. 16,899 కోట్లు ఇవ్వగా మిగిలిన కోట్లు సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ అప్పుల వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రభుత్వం 2020 ఆగస్టులో ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ప్రతి పౌరుడికి చక్కటి సేవలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, పేదలకు గృహాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ను వ్యతిరేకిస్తే… వారిని మభ్య పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చని జస్టిస్ మిశ్రా దగ్గర నుంచి లేఖను తీసుకొచ్చి ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొదటి ఏడాదిలోనే మోసం చేయాలనే ఒక ప్రణాళికతో బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించడానికి ఎస్ర్కో అకౌంట్లు ప్రభుత్వం ప్రారంభించింది.