సజావుగా శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర.

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాల మధ్య శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర సజావుగానే సాగుతోందని దేవస్థానం బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. వాతావరణశాఖ సూచనల దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ వైష్ణోదేవి యాత్రకు దేవస్థానం మే నుంచి భక్తులను అనుమతి ఇస్తోంది. ఈ మేరకు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు కొవిడ్‌ నెగెటివ్‌ ఆర్టీ పీసీఆర్‌ సర్టిఫికెట్‌ను చూపించాలని నిబంధన విధించింది.

ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉరుములు, పిడుగులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాలకు వరద పోటెత్తుతోంది. కొండ ప్రాంతాల్లోనూ నీరు ఉప్పొంగుతోంది. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం కిష్టావర్‌ జిల్లాలోని గులాబ్‌గఢ్‌లో కుంభవృష్టి కారణంగా ఏడుగురు మృతి చెందగా. 19 మంది గల్లంతయ్యారు. ఇందులో ఇప్పటి వరకు 17 మందిని రక్షించగా.. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని దోడా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ (డీఐజీ) ఉదయభాస్కర్ బిల్లా తెలిపారు.