క్లిష్ట సమయంలో భారత్ కు భారీ సహాయం ప్రకటించిన ట్విట్టర్ సంస్థ.

కరోనా మహమ్మరిపై చేస్తున్న పోరాటానికి పలు సహచర దేశాలు, ప్రముఖ సంస్థలు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాయి. తాజాగా ట్విట్టర్‌ సంస్థ 15 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేర్‌, ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు. కేర్‌ సంస్థకు పది మిలియన్‌ డార్లు ఇవ్వగా.. ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏలకు 2.5 మిలియన్‌ డాలర్ల చొప్పున ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, వెంటిలెటర్లు, బిపాప్‌, సీపీఏపీ యంత్రాలు సేకరించేందుకు గ్రాంట్‌ ఉపయోగపడుతుందని.. లాక్‌డౌన్‌లో మనుగడ సాగించేందుకు, జీవనోపాధిని తిరిగి పొందేందుకు, తక్కువ ఆదాయం ఉన్న వారికి, సేవ కార్యక్రమాలు చేపట్టే ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలను బలోపేతం చేసేందుకు ఆయా సంస్థలు నిధులను వినియోగిస్తాయని కంపెనీ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలకు పరికరాలు సమకూరుస్తాయని, అలాగే తాత్కాలిక కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతుగా నిలిచేందుకు నిధులు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్‌, ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈ కిట్లు, ఇతర అత్యవసరమైన సామగ్రి అందించడంతో పాటు టీకాల పంపిణీలో సహాయం అందిస్తాయని పేర్కొన్నారు.