టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ అస్వస్థత

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌  ఘట్టమనేని కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జనరల్‌ చెకప్‌ కోసమే ఆయన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  సూపర్‌ స్టార్‌ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కారణంగానే ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కృష్ణను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. టాలీవుడ్‌ చిత్ర సీమలో సూపర్‌ స్టార్‌గా తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు కృష్ణ. దాదాపు 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో.. కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించారు. సినిమాల్లో హీరోగా నటించటం లోనూ రికార్డులను సృష్టించారు. ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాల్లో నటించి, విడుదల చేశారు. నిర్మాతగా కూడా ఎన్నో హిట్టులతో పాటు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను నిర్మించారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.