శ్రీ కృష్ణ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి – జనసేనాని

చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్ధకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ  ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్ప టి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా  కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన  కృష్ణ  కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే  కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు  మహేష్ బాబు కి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను.