కత్తి మహేష్ కన్నుమూత : చెన్నైలో చికిత్స పొందుతూ ..!!

సినీ విమర్శకుడు నటుడు కత్తి మహేష్ కన్నుమూసారు. గత వారం నెల్లూరు జిల్లా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, బ్రెయిన్ కు దెబ్బ తగలటంతో పాటుగా రెండు కళ్లు చూపు కోల్పోయారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మహేష్ ను సన్నిహితులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

అక్కడ కంటికి ఆపరేషన్ సైతం నిర్వహించారు. ఆయన కోలుకుంటున్నాడంటూ ఆయన మిత్రులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్స కోసం రూ 17 లక్షలు మంజూరు చేసింది. అప్పటి నుండి అపోలోలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఈ సాయంత్రం తుది శ్వాస విడిచారు.

చిత్తూరు జిల్లాకు చెందిన కత్తి మహేష్ హైదరాబాద్ లో స్థిర పడ్డారు. అనేక వివాదస్పద చర్చల్లో పాల్గొని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని సినిమాల్లోనూ కత్తి నటించారు. కోలుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో కత్తి మహేష్ తలకు తగిలిన బలమైన గాయం తో పాటుగా శరీర అవయవాలు చికిత్సకు సహకరించకపోవటంతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.