అండర్‌-19 ఆసియా కప్‌ విజేతగా టీమిండియా

ఆసియా కప్ అండర్‌-19 విజేతగా యువ భారత్‌ నిలిచింది. వరుణుడి ఆటంకాల నడుమ 38 ఓవర్లకు కుదించిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక యువ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్‌ విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకేయులు.. 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక ఇన్నింగ్స్‌లో యాసిరు​ రోడ్రిగో(19 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లు విక్కీ ఓస్వాల్‌(3/11), కౌశల్‌ తాంబే(2/23), రాజ్‌ బవా(1/23), రవికుమార్‌(1/17), రాజవర్ధన్‌(1/26) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు.  అనంతరం డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 38 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ భారత్‌.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ రఘువంశీ(56 నాటౌట్‌), గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌(31 నాటౌట్‌) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కాగా, ఈ టోర్నీ నిర్వహించిన 9 పర్యాయాల్లో టీమిండియా 8 సార్లు విజేతగా నిలవడం విశేషం. 2017లో యువ అఫ్గాన్‌ జట్టు.. పాక్‌ను ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత టోర్నీలో భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్‌ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు.