రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. వాటిపై కోర్టులోనే తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. అక్రమ కేసులెన్ని పెట్టినా పార్టీకి అండగా చాలా మంది కార్యకర్తలున్నారన్నారు. ఇవాళ పార్టీ రాజమండ్రి గ్రామీణం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని చెప్పి ఇప్పుడు అందులో రూ.వెయ్యి కోత పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే.. కేవలం 1.8 లక్షల మందికే రూ.10 వేలు ఇచ్చారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి నెలకు రూ.4 వేలు అదనంగా వారి నుంచే వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చలానాల రూపంలో పోలీసులూ మరికొంత వారి నుంచి తీసుకుంటున్నారన్నారు.