స్వీడన్​కు తొలి మహిళా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రాజీనామా

ఐరోపా దేశమైన స్వీడన్‌లో బుధవారం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు ప్రధాని పగ్గాలు అప్పగించడం.. కొద్ది గంటల్లోనే ఆమె రాజీనామా  చేయడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. మగ్దలీనా అండర్సన్​కు(54) దేశ పాలన పగ్గాలను అప్పగిస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశఆర్థిక మంత్రి, సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన అండర్సన్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నారంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. కొద్ది గంటల్లోనే పార్లమెంటులో ఓ బడ్జెట్‌ ఓడిపోవడం, రెండు పార్టీలతో కూడిన మైనారిటీ ప్రభుత్వం నుంచి ఓ సంకీర్ణ భాగస్వామి వైదొలగడంతో ఆమె రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మగ్దలీనా. “ఈ బాధ్యత గౌరవప్రదమే అయినా.ఉనికి ప్రశ్నార్థకమయ్యే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని నేను కోరుకోవడం లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు.