అమరావతి సంస్థాన పాలకుడు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు

చింతపల్లి ప్రభువు, దక్షిణ భారతదేశంలోనే పేరుపొందిన జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు.గుంటూరు, కృష్ణ జిల్లాలో నాయుడు నిర్మించిన దేవాలయాలు, ప్రసాదించిన అగ్రహారాలు అయన కీర్తిచంద్రికలను వెదజల్లుతున్న చిహ్నాలు. సాటి ప్రభువు ఒకరు శ్రీ వెంకటాద్రి నాయుడుగారు మరణిస్తే ఆబాల గోపాలమూ దుఃఖిస్తారు అని ప్రశంసించటం వాసిరెడ్డి వెంకటాద్రినాయుని గొప్పతనానికి నిదర్శనం. వెంకటాద్రినాయుడు దాతృత్వాన్ని, సహృదయతను, కళాపోషణను విద్యలపట్ల ఆదరణను పొందిన రచయితలు కధలుగా రాశారు. బ్రిటీష్ పాలకులపై భారతదేశంలోనే తొలిసారిగా కత్తికట్టిన పోరాట యోధుడు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు.

శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
1761, ఏప్రిల్ 27 న జగ్గన్న,అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. కృష్ణా మండలములోని చింతపల్లి వీరి రాజధాని. వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని కృష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోటకు మార్చాడు. వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. పిండారీ దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి. వేంకటాద్రి నాయుని సైన్యములో వేలమందిసైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో నాయుని భవనములు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములు, బంగారు ఆభరణములు బహూకరించబడుతుండ వినిరతాన్నదానములు జరుగుతుండేవి.

క్రీ.శ. 1791-92లో వచ్చిన భయంకర ఉప్పెనలో తీరాంధ్ర గ్రామములలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరము తీవ్రమైన కరవు వచ్చింది.నాయుడు గారు ఏడు సంవత్సరములుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్షల బంగారు నాణెములు ప్రజల కొరకు వినియోగించుటకు బ్రిటీషు ప్రభుత్వానికి తెలియచేశారు. మచిలీపట్టణము లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయము మరుగున పడింది.బ్రిటీషు ప్రభుత్వము నాయనిగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన నాయుడు చింతపల్లిని విడచి గుంటూరు మండలములోని ధరణికోట వద్ద అమరావతియను పట్టణము, భవనాలు కట్టించాడు. 1797లో అమరావతి పట్టణము దర్శించిన కోలిన్ మెకంజీ అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారింది.

ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది. శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పేరు మెదనె అచ్చమ్మపెటగా మారినది. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17 న మరణించాడు. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, రాజనీతిజ్ఞత, వీరత్వం, విద్వజ్జనపక్షపాతం, దాతృత్వం, భక్తి – అన్నీ కలిసి మూర్తీభవించిన రూపమే వేంకటాద్రినాయుడు.