అపర చాణిక్యుడు – పివి నరసింహారావు

మారుమూల పల్లెలో పుట్టి శాసనసభ్యుడిగా, కేంద్రమంత్రిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొట్ట మొదటి తెలుగువాడిగా చరిత్ర సృష్టించిన, రాజకీయ చాణిక్యుడు పీవీ నరసింహారావు గారు. తన జీవితాంతం దేశ అభివృద్ధికి, దేశ ప్రజల సంక్షేమం కోసం పరితప్పించిన నిరాడంబర నాయకుడు పివి నరసింహారావు గారు.

పివి నరసింహారావు గారు, తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు జన్మించారు. అయితే, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు సంతానం లేకపోవడంతో, బంధువుల కొడుకు అయినా ‘పివి’ ని దత్తత తీసుకున్నారు. పివి గారికి పదేళ్ల వయసులోనే సత్యమ్మ తో వివాహమైంది. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య, హన్మకొండలో గవర్నమెంట్ స్కూల్ లో మెట్రిక్యులేషన్ చదివారు. హైదరాబాదులో వందేమాతరం ఉద్యమం తారస్థాయిలో ఉన్న సమయంలో ఇంటర్ చదవడానికి పివి హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నిజాం వారి నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ, దాదాపు 300 మంది స్నేహితులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గేయాన్ని పాడారు.

దాంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతనును 1938లో బహిష్కరించారు. అప్పుడు ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి,
నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ L.L.B చదివారు. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ కు వచ్చి మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్ గా చేరి స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు శిష్యుడిగా, కాంగ్రెసు పార్టీలో చేరి 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. 1952 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పొందారు. అయితే పివి, అపజయం ఎరుగని రాజకీయజీవితం 1957 నుంచి ప్రారంభమైంది. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు.

పివి 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి గాను, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గాను, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారటం తో, ముఖ్యమంత్రిని మార్చాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ కి వచ్చినప్పుడు, వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, మచ్చలేని రాజకీయ నేపథ్యం ఉండటంతో పీవీకి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దాంతో 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రిగా పీవి ప్రమాణ స్వీకారం చేశారు.

తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు కఠినమైన చర్యలు తీసుకున్నారు, దాంతో అది నచ్చని భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అదే సమయంలో పార్టీలో అసమ్మతి తలెత్తింది. సరిగ్గా ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. ఆ సమయాన్ని అనువుగా మార్చుకున్న కొంత మంది సొంత పార్టీ నాయకులు, పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. దాంతో రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు.

అది నచ్చని కాంగ్రెస్ హైకమాండ్, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం అర్ధాంతరంగా ముగిసింది. అ తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. ఇందిరాగాంధీ పీవీని 1973లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1975 వరకు ఆ పదవి లోనే పివి పని చేశారు. ఆ తర్వాత మొదటిసారిగా హనుమకొండ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అ సమయంలో హోం శాఖ, విదేశాంగ శాఖల బాధ్యతలు నిర్వహించారు. 1984లో మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అ సమయంలో హోంశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖకు రాజీవ్ గాంధీ నేతృత్వంలో పని చేశారు.

1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యని పివి, ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో, కాంగ్రెసు పార్టీకి ముందుండి నడిపించగలిగే నాయకుడు అవసరం అవడంతో, తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డారు. దాంతో దేశ భవిష్యత్తును కాపాడడానికి, ప్రధానమంత్రిగా ఒక తెలుగువాడు బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. దాంతో 1991 జూన్ 21న భారతదేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పివి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు, ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకున్నా, అతని అపార తెలివితేటలతో, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకు ఉన్న అపార అనుభవంతో ఎన్నో కష్టాలను అధిగమించారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో
దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు, పునరుజ్జీవం కల్పించేందుకు,తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, అనేక సంస్కరణలు చేపట్టారు. ఆ సంస్కరణల ఫలితంగానే, భారత ఆర్థిక వ్యవస్థ సర వేగంగా అభివృద్ధి చెందింది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. అలాగే, పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసారు. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విజయవంతంగా పివి విడిపించారు.

ఒకపక్కన రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన సాహిత్య ప్రీతిని వదిలిపెట్టలేదు. తెలుగు, ఇంగ్లీషు, హిందీయే కాక 17 భాషల్లో పట్టు ఉన్న పి.వి, విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగల’ నవలను “సహస్రఫణ్” అన్న పేరుతో హిందీలోకి అనువదించారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. అలాగే, ఇన్‌సైడర్ పేరుతో పీవీ రచించిన ఆత్మకథ నవల, తెలుగులోకి ‘లోపలి మనిషిగా’ అనువాదం అయింది. ఈ నవల దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఇవేగాక మరెన్నో వ్యాసాలు ‘కలం’ పేరుతో పివి ప్రశ్నించారు. ‘కాంగ్రెసువాది’ పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించారు.

అయితే తన ఆత్మకథ రెండో భాగం రాయాలని తలచిన పివీ, ఆ కోరిక నెరవేరకుండానే 2004, డిసెంబర్ 23 న కన్నుమూసారు.

పీవీ నరసింహారావు మరణించిన తర్వాత అతని అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు.
మాజీ ప్రధాని మరణిస్తే ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సిన కేంద్ర ప్రభుత్వం, భౌతికకాయాన్ని రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పీవీ అంత్యక్రియలను సరిగ్గా నిర్వహించలేదు. అలాగే మరణించిన ప్రతి మాజీ ప్రధానికి ఢిల్లీలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేస్తారు కానీ, పివి కి ఆ గౌరవం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అంతవరకు కనీసం పీవీ నరసింహారావు గారి గుర్తుగా ఏ రాజకీయ పార్టీలు విగ్రహాన్ని ప్రతిష్టించ లేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వం, భారతదేశ తొలి తెలుగు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారికి అందాల్సిన గౌరవాన్ని తిరిగి తీసుకోచ్చారు. ఇక ఈ ఈరోజు పీవీ నరసింహారావు గారి శత జయంతి కావడంతో, ఈరోజు నుంచి శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. పీవీ మన ఠీవీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.