ట్విట్టర్ లో ట్రెండింగ్ గా చిరు డైలాగ్

హైదరాబాద్‌: ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి.ఆయన కీలక పాత్రలో మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, తాజాగా చిరంజీవి సంభాషణ ఆడియోను విడుదల చేసింది. రాజకీయాల గురించి చిరంజీవి చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది. దీన్ని చిరు ట్విటర్‌గా వేదికగా పంచుకోగానే నిమిషాల్లోనే వైరల్‌ అయింది. చిరు సినిమాలో డైలాగ్‌ చెప్పారా? లేదా సమకాలీన రాజకీయాలపై స్పందించారా? అంటూ సోషల్‌మీడియా వేదికగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో చిరు పొలిటికల్‌ డైలాగ్‌తో ప్రచారం మొదలు పెట్టడంతో ప్రస్తుతం సోషల్‌మీడియా దృష్టంతా చిరు ట్వీట్‌పైనే పడింది. దీంతో అటు అభిమానులకు, ఇటు సినిమా ప్రచారానికి ఒక్క ట్వీట్‌తో ట్రీట్‌ ఇచ్చేశారు చిరంజీవి.