కరోనా వైరస్‌కు సంబంధించి మరో ఆందోళనకర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు

●పాండమిక్ నుంచి ఎండెమిక్‌గా మారే అవకాశం
●అదే జరిగితే మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశం
●వ్యాక్సిన్ ద్వారా లభించే రోగ నిరోధకశక్తి ఏడాదికే పరిమితం

◆కరోనా మహమ్మారికి సంబంధించి శాస్త్రవేత్తలు మరో ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం పాండమిక్ (మహమ్మారి) గా ఉన్న కరోనా వైరస్ భవిష్యత్తులో ఎండెమిక్ (స్థానపర వ్యాధి) గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంటే టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ వ్యాధి మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఓ అంచనాకొచ్చారు. తట్టు వంటి వాటికి టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ దానిని పూర్తిగా నిర్మూలించలేకపోయినట్టు చెబుతున్నారు.

ఏదైనా ఒక ప్రదేశానికి పరిమితమై మళ్లీ మళ్లీ సంక్రమించే ‘ఎండెమిక్’ లక్షణంగా కరోనా వైరస్ మారే అవకాశం ఉందని కొలంబియా మెయిల్‌మాన్ స్కూల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇలా మారడానికి పలు కారణాలు దోహదం చేస్తాయన్నారు. రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ లభ్యత, దాని సమర్థత, సీజనాలిటీ వంటివి ఇందుకు కారణం అవుతాయన్నారు.

నిజానికి వైరస్ సోకి కోలుకున్న తర్వాత లభించే రోగనిరోధకశక్తి కానీ, వ్యాక్సిన్ ద్వారా లభించేది కానీ ఏడాదిలోపే తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి ఆ తర్వాత కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందన్నారు. అదే సమయంలో ఇతర స్థానిక కరోనా వైరస్ (ఎండెమిక్) సంక్రమణ ద్వారా లభించే రోగ నిరోధక శక్తి చాలా కాలం ఉండే అవకాశం ఉందని, అది సాధ్యమైతే కొన్ని సంవత్సరాలపాటు వైరస్ వ్యాప్తి పునరావృతమైన తర్వాత దానిని పూర్తిగా నిర్మూలించే వీలుంటుందని వివరించారు. అయితే, ఇందుకు కూడా వ్యాక్సిన్ లభ్యత, దాని ప్రభావం వంటివి దోహదం చేస్తాయని అన్నారు. అయితే, ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు వివరించారు.