ఎస్సీ సర్పంచ్ కి గౌరవ మర్యాదలు దక్కవా

కృష్ణాజిల్లా నందిగామ: కృష్ణాజిల్లాలో మేజర్ పంచాయతీల్లో ఒకటైన కంచికచర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు దక్కకపోగా అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. సర్పంచ్ గా ఎన్నికై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పంచాయతీ కార్యాలయం లో ఛాంబర్ కేటాయించకపోవడం దీనికి అద్దం పడుతుంది. కంచికచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో సుమారుగా 30 వేల మంది జనాభా కలిగి ఉన్న కంచికచర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు చేసారు. ఈ నేపథ్యంలో వైసిపి పార్టీ తరఫున గ్రామానికి చెందిన వేల్పుల సునీత ను సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికలలో నిల బెట్టడం జరిగింది. పంచాయతీ సర్పంచ్ గా వేల్పుల సునీత 3260 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.పంచాయతీ సర్పంచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నప్పటికీ పార్టీలోని కొంతమంది నాయకులు, పంచాయతీ అధికారులు కలిసి సర్పంచ్ పై వివక్ష చూపుతూ ఆమె అధికారాలను కాలరాస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి కి, సిబ్బందికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకొని పంచాయతీ కార్యాలయంలో ఇప్పటివరకు సర్పంచ్ కు చాంబర్ ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. పంచాయతీ కార్యదర్శితోపాటు కొంతమంది అధికారులు గ్రామానికి చెందిన కొంతమంది అగ్రకులాలకు చెందిన నాయకుల అండదండ లతో సర్పంచ్ పై వివక్ష చూపుతూ సర్పంచ్ సునీతను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వైసిపి నాయకులు బహిరంగంగానే మాట్లాడుకుంట న్నారు. గ్రామంలో ప్రభుత్వం తరుపున ఏ కార్యక్రమం నిర్వహించిన సొంత పార్టీ నాయకులే సర్పంచ్ కు ప్రాధాన్యత ఇవ్వటం లేదని వైసిపికి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అనుమతులు లేకుండా కార్యదర్శి, కొంతమంది అధికారులు పట్టణ నాయకులు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు జోక్యం చేసుకుని సర్పంచ్ కు తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. సర్పంచ్ పట్ల వివక్ష చూపే పార్టీ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ క్యాడర్ నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తుంది.