ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి : మంద కృష్ణమాదిగ
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల : రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురు కలిసి ఈ సమస్యను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. గతంలో పనిచేసిన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి ,చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మాన కాపీని పార్లమెంటుకు పంపించారనీ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు . ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని తెలిపారు. విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టకపోతే ఫిబ్రవరి 12వ తేదీన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారినీ రెండు తెలుగు రాష్ట్రాలలో దిగ్బంధం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎండ్రాతి కోటేశ్వరరావు మాదిగ, పరస రామయ్య మాదిగ, కోట డానియల్ మాదిగ, విష్ణువర్ధనరావు మాదిగ, శేషం రవి కిషోర్ మాదిగ, మాడుగుల ఆంజనేయులు మాదిగ తదితరులు పాల్గొన్నారు.