మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే

సావిత్రీబాయి 3 జనవరి 1931 తేదిన మహారాష్ట్రలోని సతారాజిల్లా నాయగాఁవ్ గ్రామంలో జన్మించారు. తొమ్మదివ యేటనే తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం 12 ఏళ్ళ జ్యోతిభాపూలేను ఆమె వివాహం చేసుకున్నారు.  బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం నిషిద్ధం అని చెబుతున్న రోజుల్లోనే తన భర్త ప్రోద్బలంలో సావిత్రి పాఠశాలలో చేరారు. విద్యార్థినిగా ఉంటునప్పుడే తన భర్త ఇచ్చిన “నీగ్రోల మానవహక్కుల పోరాటయోధుడు థామన్ క్లార్క్‌సన్ ఉద్యమ చరిత్ర”ను ఆమె చదివారు. తను కూడా భర్తతో కలిసి మానవహక్కుల పోరాటయోధురాలిగా మారారు. పాఠశాలలు కేవలం బ్రాహ్మణ పిల్లలకే పరిమితమైన రోజుల్లో.. జ్యోతిభాపూలే నిమ్నజాతుల  పిల్లల కోసం పాఠశాలలు స్థాపించారు. ఆ తర్వాత సావిత్రిబాయి మహిళల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. ఆ విధంగా ఆమె భారతదేశంలో స్థాపించబడిన మొదటి మహిళా పాఠశాలకి అధ్యాపకురాలిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకున్నారు.

సావిత్రిబాయి రచయిత్రి కూడా. ‘‘కావ్యఫూల్’’ అనే కవితా సంపుటిని ఆమె ప్రచురించారు. అందులోని కవితలు సమాజంలో అవిద్యను రూపుమాపి, కులాలకతీతంగా అందరూ విద్యాహక్కు కలిగుండాలనే భావాలతో ఉండడం విశేషం. కులవ్యవస్థ బాగా ప్రబలిపోయిన సమాజంలో అందరూ “సత్యాన్ని” శోధించడానికి కంకణం కట్టుకోవాలనే తత్వాన్ని ప్రచారం చేస్తూ. 1873లో ఫూలే దంపతులు” సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడి వితంతువు పునఃర్వివాహలకు మద్దతుగా ఉద్యమాలు నడిపారు. కులాలకతీతంగా దేశంలో అనాథపిల్లల పట్ల అందరూ అక్కర చూపాలనే భావనను ప్రచారం.. తాము సైతం చనిపోయిన ఓ బ్రాహ్మణ యువతి కుమారుడిని దత్తత తీసుకున్నారు.

1890 నవంబరు 28 తేదిన జ్యోతిభాపూలే మరణించిన సమయంలో.. తన భర్తకు తానే స్వయంగా చితిపెట్టి మరో విప్లవానికి తెరలేపారు సావిత్రి. అలాగే ఆమె భర్త చనిపోయాక.. తన బొట్టు తీయలేదు.. అలాగే శిరోముండనం చేయించుకోలేదు. దళిత, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ కులాల మహిళల ఐక్యతకోసం పాటుబడిన సావిత్రిబాయి తన పాఠశాలల్లో అన్ని మతాలకూ చోటు కల్పించేవారు. ఆమె పాఠశాల ద్వారే ఫాతిమాషేక్ అనే యువతి తొలి ముస్లిం మహిళా అధ్యాపకురాలుగా చరిత్రకెక్కడం గమనార్హం.  1897లో పూణె నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలిపోవడంతో కొన్నివేలమంది ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో దళితవాడల్లో రోగగ్రస్తులకు సేవ చేయడానికి నిశ్చయించుకున్నారు సావిత్రిబాయి. గ్రామాలకు తక్షణం వైద్యసహాయం అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. ప్రజలకు వైద్యసహాయం అందేలా చూశారు. అయితే అదే ప్లేగు వ్యాధి ఆమెకి సోకి మార్చి 10, 1897న పరమపదించడం విషాదకరం.