వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు ముగిసాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించారు. అంతర్ రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.

అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని, రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్ మొదలు పెట్టాలనినిర్ణయానికొచ్చామని ఏపీఎస్ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ముందుగా 256 సర్వీసులు ఏపీ నుంచి తెలంగాణకు నడపాలని నిర్ణయించామని, వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా, కిలోమీటర్ ప్రాతిపదికగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించామని, కోవిడ్ నిబంధనలు ప్రకారమే బస్సులు నడుపుతామని చెప్పారు. అలాగే, విభజన జరిగినపుడు ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అమలు కాలేదని, దాని మీద కూడా చర్చ జరిగిందని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి వెల్లడించారు.