వాడిని పట్టిస్తే నేను 50,000 ఇస్తాను.. ఆర్ పి పట్నాయక్

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ పోస్ట్‌ పెట్టారు.

‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆర్పీ పట్నాయక్‌ తెలిపారు.

మరోవైపు సైదాబాద్‌ ఘటన పట్ల పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. రాజుని పట్టుకోవడంలో పోలీస్‌ శాఖకు సాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. మహేశ్‌బాబు ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’ అంటూ నాని వ్యాఖ్యానించారు.