కోలుకుంటున్న సాయితేజ్‌.. రెండు, మూడు రోజుల్లో సాధారణ వార్డుకు షిఫ్ట్

సినీ హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అవడంతో కిందపడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తొలుత ఆయనను మెడికవర్ ఆసుపత్రికి, ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాగా… వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.

సాయితేజ్ కోలుకుంటున్న నేపథ్యంలో, ఆయన హెల్త్ బులెటిన్ ను అధికారికంగా విడుదల చేయడాన్ని వైద్యులు ఆపేశారు. అయితే వైద్యులు మాట్లాడుతూ, వెంటిలేటర్‌ సపోర్టు తొలగించామని, ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉన్నారని, చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకి తరలిస్తామని చెప్పారు. మరోవైపు సాయితేజ్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఆసుపత్రికి తరలి వస్తున్నారు. నిన్న సాయంత్రం చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి సాయితేజ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.