ప్రభుత్వ అధికారిక భవనం ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎట్టకేలకు తన నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌ బంగళాలో 1997 నుంచి ఉంటున్న ఆమె ప్రభుత్వ ఆదేశాలతో నివాసాన్ని నేడు ఖాళీ చేశారు. నిజానికి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాల్సి ఉండగా, డెడ్‌లైన్‌కు రెండు రోజుల ముందే ప్రియాంక బంగళాను ఖాళీ చేయడం విశేషం. అయితే సెంట్రల్ ఢిల్లీకి మకాం మార్చడానికి ముందు కొన్ని రోజులు ఆమె గురుగ్రామ్‌లోని సెక్టార్ 42లోని పెంట్‌హౌస్‌లో ఉంటారని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడికి కొన్ని వస్తువులు తరలించారని, ఆమె పిల్లలు కొన్ని రోజులపాటు అక్కడే ఉంటారని సమాచారం. ఢిల్లీలోని కొత్త ఇంటికి ప్రస్తుతం అధునికీకరణ పనులు జరుగుతున్నాయి.అవి పూర్తయిన వెంటనే మకాంను అక్కడికి మారుస్తారని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.