దొనకొండ పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ దొనకొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసారు. పోలీసు స్టేషన్ లోని సిబ్బంది గదులు, లాకప్, ఉమెన్ హెల్ప్ డెస్క్, రికార్డుల నిర్వహణ, పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీస్ క్వాటర్స్ ను పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసులను, క్రైమ్ రికార్డ్స్ ను, కేసు డైరీలు మరియు రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినారు. పోలీసు స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల పరిస్థితి, ఎక్కువగా జరిగే నేరాల గురించి, వాటిని నియంత్రించటానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కేసు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు. విచారణలో ఉన్న కేసుల యొక్క పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది మొదలగు అంశాలను గూర్చి ఆరా తీసి సదరు కేసులలో తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. కేసులకు సంబందించిన అన్ని వివరాలను CCTNS లో విధిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

పోలీస్ సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి విధుల్లో ఉండాల్సిన తీరుపై దిశా నిర్ధేశం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని,  అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ మద్యం, నాటు సారా అక్రమాల కట్టడి కోసం ప్రత్యేక నిఘా వేయాలని సూచించారు. అలాగే మహిళా పోలీసులతో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు మరియు నాటు సారా తయారీ దారులు సమాచారాన్ని, మిస్సింగ్ కేసులు, మహిళలు మరియు చిన్న పిల్లల పట్ల జరిగే నేరాలు, సైబర్ నేరాల గురించి, ప్రాపర్టీ నేరస్తుల వివరాలు, రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు, బ్యాడ్‌ క్యారెక్టర్‌ ఉన్న వ్యక్తుల వివరాలు, వారి జీవన విధానం మరియు కార్యకలాపాల సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి పై అధికారు కు తెలియచేయాలని సూచించారు. గ్రామ ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులకు అండగా నిలవాలని, పోలీసు యొక్క సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా మన విధులు ఉండాలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు స్టేషన్ పరిసరాలలో మొక్కలను నాటి సిబ్బంది అందరూ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచాలని సూచించారు. వార్షిక తనిఖీ అనంతరం దొనకొండ మండలం, చందవరం గ్రామంలో క్రీ.పూ .2 – క్రీ.శ 2 వ శతాబ్దాల మధ్యకాలం లోని విలసిల్లిన బౌద్ధ స్థూపమును మరియు చందవరం గ్రామం పంచాయితీ కార్యాలయం వద్ద వివిధ శిల్పాలను ఎస్పీ  సందర్శించి, వాటి సంరక్షించుటకు పురావస్తు శాఖలకు చెందిన అధికారులకు తగు సూచనలు తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట దర్శి DSP నారాయణ స్వామి , DSB DSP బి.మరియదాసు , పొదిలి సిఐ సుధాకర్ , దొనకొండ ఎస్సై అంకమ్మ, ఐటి కోర్ ఎస్సై అజయ్ కుమారు, ఎస్పీ సిసి నారాయణ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.