ప్రకాశం జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు.

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో జిల్లా అంతట కరోనా వైరస్ రెండో దశపై అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ప్రజలను జిల్లా పోలీసులు చైతన్య పరుస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ఒంగోలులోని, మంగమూరు జంక్షన్ వద్ద ఎస్పీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మాస్కులు ధరించకుండా వాహనాలు నడుపుతున్న ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు. అదే విధంగా పోలీస్ అధికారులు మాస్కులు ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికీ జరిమానా విధించారు. మాస్కులు ధరించి వున్న వాహనదారులకు ఎస్పీ పువ్వులు అందచేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మాస్కులు ధరించకుండా నడుపుతున్న వాహనదారులుకు ఎస్పీ స్వయంగా మాస్కులు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో మాస్కులు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాన్నమని, కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని తెలియజేశారు.

ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని, తమ సంరక్షణ, ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని జిల్లా ఎస్పీ కోరారు. కొందరు వాహనదారులు, ప్రజలు నోరు, ముక్కు కప్పి ఉంచేలా మాస్కు కట్టుకోకుండా అలంకారప్రాయంగా తగిలించుకోవడం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనన్నారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఎస్పీ సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కఠిన చర్యలలో భాగంగా ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న కొన్ని రోజులు తర్వాత మాస్క్ ధరించని వాహనాలను కూడా సిజ్ చేయటం జరుగుతుందని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా తిరిగే వారిపైన కూడా జరిమానా విధించడం జరుగుతుందని, ప్రైవేట్ సంస్థలు, కళాశాలలు, పాఠశాల యాజమాన్యాలు కరోనా వైరస్ నివారణలో భాగంగా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీస్ శాఖ తరుపున కూడా అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ తెలియజేశారు.ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మాస్కు ధరించని వారిపై 2,760 కేసులు నమోదు చేసి 2,60,230/- రూపాయలు చలానా విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి ప్రసాద్, ట్రాఫిక్ డీఎస్పీ యన్.సురేంద్ర, ఎస్బీ-1 ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ, కమాండ్ కంట్రోల్ ఇన్ స్పెక్టర్ ఆర్.రాంబాబు, ఒంగోలు తాలూకా సిఐ రామకృష్ణరెడ్డి, ఒంగోలు వన్ టౌన్ సిఐ సిహెచ్. సీతారామయ్య, ఒంగోలు టౌన్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొనారు.