క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయి: అనిల్ కుంబ్లే !

భవిష్యత్తులో సాంకేతికత భారీగా పెరుగుతుందని దీనితో క్రికెట్ లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపారు. భవిష్యత్ లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ ఎస్) విధానంలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అదే జరిగితే ఏ క్రీడాకారుడూ డేటా ఇంటిలిజెన్స్ ను కొట్టిపారేయలేడని తాజాగా ఓ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ‘బిల్డింగ్ కాంపిటిటివ్ అడ్వాంటేజ్ త్రూ స్పోర్ట్స్ అనలిటిక్స్ అండ్ డేటా ఇంటెలిజెన్స్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న కుంబ్లే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కుంబ్లే మాట్లాడుతూ.. ఇప్పటికే క్రికెట్ లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ ఎస్) ప్రభావం ఎంతగానో ఉంది. అది మంచి ఫలితాలను కూడా ఇస్తోంది. భవిష్యత్తులో నిర్ణయాత్మక విధానాలు తీసుకోవడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆవిష్కరణలను ఆటగాళ్లు అంగీకరించాలి. లేకుంటే మీరు వెనుకబడిపోతారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను ఉపయోగించుకోవడం ఆటకూ మంచిది. ఎలాంటి పొరపాట్లు తప్పిదాలు జరగకుండా టెక్నాలజీ ద్వారా సరైన నిర్ణయాలు వెలుబడుతాయి అని అన్నారు.

క్రికెట్ లో సాంకేతికత అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా అది ఆటకు మంచి చేస్తుందని అందుకే అది ఆహ్వానించదగ్గ విషయమని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తెలిపారు.

ఈ క్రమంలోనే క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయని పేర్కొన్నారు. ఇకపై ఆటలలో టీవీలు ప్రసారదారుల ప్రభావం అధికంగా ఉండదన్నారు. క్రీడా సమాఖ్యలు సైతం ప్రజలకు చేరువ అయ్యేందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటారని జంబో అభిప్రాయపడ్డారు.

ఆటలను ప్రజలకు చేరువ చేసేందుకు ఇన్ని రోజులు టీవీలు కీలక పాత్ర పోషించాయని ఇకపై ఓటీటీలు వస్తాయని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వివరించారు. ఈ మార్పుల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు క్రికెట్ లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లు పెరిగేకొద్దీ డేటా ఇంటిలిజెన్స్ అధికమవుతుందని ఆయన అంచనా వేశారు. ఆటలు ఎంత చిన్నగా మారితే డేటా ఇంటిలెజెన్స్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుందని కుంబ్లే చెప్పుకొచ్చారు.