ఆందోళన విరమించిన సినీ కార్మిక సంఘాలు

 వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకారం తెలపడంతో సినీ కార్మికులు ఆందోళన విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో తమ ఆందోళన విరమించి రేపటి నుంచి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై రెండు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సినీ కార్మిక సంఘాలు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటలపాటు చర్చించారు. సినీ కార్మికుల వేతనాలపై దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.