ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు : నటయశస్వి ఎస్. వి. రంగారావు

 ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత ఎస్. వి. రంగారావు  తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన  సహజ నటుడిగా పేరుగాంచారు.. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనుకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ.

నాటకరంగం : నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలను కున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే చొలెనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరులో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగంకీ రాజీనామా  చేసేసారు.

నటన కెరీర్ : మొదటి సినిమా వైఫల్యం తర్వాత.. కొద్ది రోజుల తర్వాత బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో మరో చిన్నపాత్ర దక్కింది. తర్వాత ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించినపాతాళ భైరవి  (1951) సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకిచ్చారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది. 1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్ళి చేసి చూడు సినిమాను తమిళంలో కల్యాణం పణ్ణి పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నై, శారద, కర్పగం, నానుం ఒరుపెణ్ వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు గాంచారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిననాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు. నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతను్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు. రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు.

రచయితగా : ఎస్.వి.రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించాడు ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. “వేట”, “ఆగష్టు 8”, “పసుపు కుంకుమ”, “ప్రాయశ్చిత్తం”, “విడుదల”, “సంక్రాంతికి”, “సులోచన” అనే ఏడు కథలు మాత్రం లభ్యమౌతున్నాయి. ఇటీవల ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.

జననం :  సామర్ల వెంకట రంగారావు, 1918 జూలై 3, నూజివీడు, కృష్ణా జిల్లా

తల్లిదండ్రులు : కోటేశ్వరరావు (తండ్రి) , లక్ష్మీ నరసాయమ్మ (తల్లి)

విద్య :  డిగ్రీ , హిందూ కాలేజ్

వృత్తి : అగ్నిమాపక శాఖ ఉన్నతోద్యోగి, నటుడు, దర్శకుడు, రచయిత

భార్య, పిల్లలు :     లీలావతి (భార్య), ఒక కుమారుడు కోటేశ్వరరావు , కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల.

బిరుదులు :  ఎస్వీయార్, నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి
బహుమతులు :  రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును , రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా రాష్ట్రపతి ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు అవార్డు అందుకున్నాడు..  2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.
మరణం :  1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు కన్నుమూశారు.
గుర్తింపు : రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన 2018 జూలై 3లో హైదరాబాదులో జరిగాయి. ఈ ఉత్సవాలను 2018 జూలై 3 నుంచి జూలై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్క రించారు. ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2013 లో భారత తపాలాశాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా ఎస్ వి రంగారావుచిత్రంతో తపాలా బిళ్ల విడుదల చేసింది.