సర్కారు ఆఫీసుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోబోమన్న ప్రదాని మోదీ

130 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం సర్కారు పాటు పడుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.
కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భంలోనూ మతం, కులం, భాషా, లింగంలపట్ల వివక్ష చూపదని తెలిపారు. రాజ్యాంగమే తమ కరదీపిక అన్న ప్రధాని నరేంద్ర మోది రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు. రెవరెండ్ జోసెఫ్ మార్ తోమా 90వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేరళ పథానమిట్టలో జరుగుతున్న వేడుకల్లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ ప్రభుత్వం సౌకర్యవంతమైన సర్కారు ఆఫీసుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోదని, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. ప్రతి భారతీయుడికి బ్యాంకు ఖాతాను కల్పించడమే దీనికి నిదర్శనమని అన్నారు. మార్ తోమా చర్చ్ జీసస్ అనుచరుడు సెయింట్ థామస్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నదని తెలిపారు. ఆయన అభిలాషతోనే భారతీయుల్లో మంచి మార్పును కాంక్షిస్తూ ఈ చర్చ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య, విద్యారంగాల్లో గణనీయమైన కృషి చేశారని ప్రశంసించారు.