ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌ ర్యాంక్‌లో మిథాలీ రాజ్‌

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మొదటి స్థానం నిలబెట్టుకుంది. ఆమె 762 పాయింట్లతో.. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లిజెల్లీ లీ తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో 91 పరుగులు చేసిన లీ తన ర్యాంకును మెరుగుపర్చుకుని ఒకటో ర్యాంకుకు చేరుకుంది. మరో భారత బ్యాట్స్‌ వుమెన్‌ స్మృతి మంధాన 9వ స్థానం దక్కించుకుంది. బౌలింగ్‌ విభాగంలో సీనియర్‌ బౌలర్ జులన్‌ గోస్వామి, స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ వరుసగా ఐదు, తొమ్మిదవ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్‌ విభాగంలో దీప్తి శర్మ 5వ స్థానం దక్కించుకుంది.

టీ20 ర్యాంకింగ్‌ల్లో భారత యువ సంచలనం షెఫాలీ వర్మ బ్యాటింగ్ విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది. 759 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన బెత్‌ మూనీ 744 పాయింట్లతో రెండో స్దానంలో, టీ20 వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన 716 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక బౌలింగ్‌ విభాగంలో దీప్తి శర్మ ఆరు, పూనమ్‌ యాదవ్‌ ఎనిమిదో స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు.