అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి బాలినేని శంకుస్థాపన చేయాలి

పాతికేళ్ల క్రితం కేటాయించిన అంబేద్కర్ ఆడిటోరియం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇస్తూ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానం ప్రతులను దళిత నేత నీలం నాగేంద్రరావు, కెవిపిఎస్ రఘురాంలు దగ్ధం చేశారు. శుక్రవారం ఉదయం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పలు దళిత సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, నెల్లూరు బస్టాండ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించేందుకు 1996లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఒంగోలు మున్సిపాలిటీపై తమ పెత్తనం ఉండటంతో, ఆడిటోరియంపై అజమాయిషీ పేరుతో కాంగ్రెస్ నాయకులు ఆడిటోరియం నిర్మాణం జరగకుండా కోర్టుల్లో కేసులు వేయించారన్నారు. 2013లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 7 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడిటోరియం స్థలాన్ని పంచుకునేందుకు, శంకుస్థాపనను అడ్డుకున్నారని నాగేంద్ర మండిపడ్డారు. ఒంగోలు పట్టణంలోని అన్ని పాలేల మాల పెద్దలు అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ను కలిసి, నిర్మాణానికి సహకరించాలని కోరారన్నారు.

అయితే దామచర్ల జనార్దన్, ఒంగోలు నడిబొడ్డులో అత్యంత ఖరీదైన స్థలాన్ని అంబేద్కర్ ఆడిటోరియంకి ఇచ్చేది లేదని అగ్రకుల అహంకారం చూపారన్నారు. దళితులు ఎగిరెగిరి ఓటు వేసి గెలిపించుకున్న వైసీపీ అధికారంలోకి వచ్చాక, అంబేద్కర్ ఆడిటోరియం పూర్తి చేస్తారని భావించామన్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ తొలి మేయర్ గా దళిత మహిళ గంగాడ సుజాతను ఎంపిక చేస్తే, వైసీపీ దళితుల రుణం తీర్చుకుందని అనుకున్నామన్నారు. కానీ అంబేద్కర్ ఆడిటోరియం స్థలాన్ని కాజేసేందుకు, గంగాడ సుజాతను అడ్డం పెట్టారని అనుమానం కలుగుతోందన్నారు. అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణాన్ని అడ్డుకుంటే దళితులు సహించరన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీర్మానం రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ, తీర్మానం కాపీలు రద్దు చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దళిత మేయర్ సుజాత, జిల్లా ఇన్చార్జి మంత్రి పినిపే విశ్వరూప్ లు ఉండగా, అంబేద్కర్ ఆడిటోరియం స్థలంపై కుట్ర జరగటం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం దళితుల ఆత్మగౌరవ సమస్యన్నారు. దళితులు ఆందోళన చేయకముందే, అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటన చేయాలని, శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించాలని కోరారు. సమావేశంలో బిల్లా చెన్నయ్య కరవాది సుబ్బారావు, మాల మహానాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దారా అంజయ్య, దేవరపల్లి రమణయ్య, వివిధ సంఘాల నాయకులు బంటుపల్లి రాజు, యరిచర్ల రమేషు, బురగ రాంబాబు, చీకటి ధనరాజు, అట్లూరి రాఘవులు, తదితరులు పాల్గొన్నారు