బ్రెజిల్‌ పారాలింపిక్స్‌లో మదురై విద్యార్థినికి మూడు స్వర్ణపతకాలు

బ్రెజిల్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో మదురైకు చెందిన విద్యార్థి జెర్లిన్‌ అనికా ఏకంగా మూడు స్వర్ణ పతకాలను సాధించింది. మదురై జిల్లా అవనియాపురం ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థిని స్థానిక కార్పొరేషన్‌ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. పాఠశాల స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో ఆమె పాల్గొని పతకాలను గెలుచుకుంది. తాజాగా బ్రెజిల్‌ నగరంలో జరుగుతున్న 24వ బదిరుల పారాలింపిక్స్‌ పోటీల్లో ఈ విద్యార్థిని పాల్గొంది. ఇందులో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన కె.న్యూటోల్ట్‌డైను ఓడించి బంగారం పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మిక్స్‌డ్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో జెర్లిన్‌ అనికా – అభివన్‌ శర్మల జోడీ మలేసియాకు చెందిన పూన్‌ – డియో జోడీలను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.. అలాగే, టీం బ్యాడ్మింటన్‌లో కూడా గోల్డ్‌ మెడల్‌ సాధించింది. పారాలింపిక్స్‌ పోటీల్లో తన కుమార్తె మూడు బంగారు పతకాలను గెలుచుకోవడంపై ఆ విద్యార్థిని తండ్రి జయరక్షకన్‌ మాట్లాడుతూ. 2019లో చైనాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతక గెలుచుకుందన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో అద్భుతంగా రాణించి పతకాలను గెలుచుకున్నట్టు తెలిపారు. ప్రపంచ బదిరుల బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల జాబితాలో 15వ స్థానంలో ఉందని, ఇపుడు మూడు బంగారు పతకాలు గెలుచుకోవడం వల్ల అగ్రస్థానానికి చేరుకోవచ్చన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.