పార్లమెంట్‌ కొత్త భవనానికి శంకుస్థాపన చేసిన : ప్రధాని మోదీ

దిల్లీ: ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తొలుత కేంద్రం భావించింది. అయితే, సెంట్రల్‌ విస్టా నిర్మాణంపై కేసు నడుస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా చేపట్టారు. శంకుస్థాపనకు గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, విదేశీ రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త భవనం నిర్మాణ కాంట్రాక్ట్‌ను టాటా ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే.

కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలువనుంది.